Wednesday, October 2, 2019

ఒక్క రూపాయికే ఎకరం భూమా? కేసీఆర్ సర్కారుకు హైకోర్టు నోటీసులు


కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోట్ల రూపాయల విలువైన భూమిని అత్యంత చౌకగా ఎలా కేటాయిస్తారంటూ మండిపడింది. హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి భూముల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు వివరణ కోరింది. ఎకరం రూపాయి చొప్పున శారదా పీఠానికి రెండు ఎకరాలు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేవలం రూపాయికే ఎకరం భూమిని కట్టబెట్టడంలో ప్రభుత్వ వైఖరి ఏంటో తెలపాలని ఆదేశించింది.


2019 జూన్ 22న హైదరాబాద్ కోకాపేటలో రెండెకరాలను ఎకరం రూపాయి చొప్పున శారదా పీఠానికి కేటాయిస్తూ టీఆర్ఎస్ సర్కారు జీవో 71 జారీ చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని, జీవో 71ను సవాలు చేస్తూ, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కోకాపేటలో ఎకరం భూమి కోట్లల్లో ఉందని, అలాంటిది కేవలం ఒక్క రూపాయికే ఎలా కట్టబెడతారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో 71ను కొట్టివేసి, శారదా పీఠానికి చేసిన భూకేటాయింపులను రద్దుచేయాలని పిటిషనర్ కోరాడు. దాంతో శారదా పీఠానికి భూముల కేటాయింపుపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ కోర్టు ఆదేశించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోపాటు శారదాపీఠం ధర్మాధికారికి నోటీసులసు ఇచ్చింది.