ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోడానికి క్యాబ్ డ్రైవర్లు కండోమ్ ప్యాకెట్ల కోసం మెడికల్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.
* క్యాబ్ లేదా ట్యాక్సీల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పకుండా ఉండాలనే నిబంధన ఉంది.
* ఆ బాక్సులో ఫస్ట్ ఎయిడ్(ప్రథమ చికిత్స) కిట్‌తో పాటు కండోమ్‌లు ఉన్నట్లయితే పోలీసుల నుంచి తప్పించుకోవచ్చని డ్రైవర్లు తెలుపుతున్నారు.
* అయితే, ఢిల్లీ పోలీసులు దీన్ని ఖండించారు. అలాంటి నిబంధన ఏదీ చట్టంలో లేదన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే పోలీసులు ఎలాంటి చలానా విధించరని తెలుసు. కానీ, కండోమ్ ఉంటే చలానా ఎందుకు వేయరు? కండోమ్‌కు.. ట్రాఫిక్ నిబంధనలను లింకేమిటీ అనేగా మీ సందేహం. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు పాటిస్తున్న ఈ వింత నిబంధన గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే.
'ఆ కిట్‌లో కండోమ్ ఉండాల్సిందే': క్యాబ్ లేదా ట్యాక్సీల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పకుండా ఉండాలనే నిబంధన ఉంది. అది ఖాళీగా ఉన్నట్లయితే ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తారు. అయితే, ఆ బాక్సులో ఫస్ట్ ఎయిడ్(ప్రథమ చికిత్స) కిట్ ఉన్నా కండోమ్‌లు లేకపోతే పోలీసుల చలానా వేస్తున్నారని డ్రైవర్లు తెలుపుతున్నారు. ''కండోమ్‌లు ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో ఎందుకు పెట్టాలనేది తెలీదు. కానీ, అవి లేకపోతే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అందుకే, పెడుతున్నాం'' అని ఓ డ్రైవర్ వెల్లడించాడు.
చట్టం ఏం చెబుతోంది: ఢిల్లీ వెహికిల్స్ రూల్స్ (1993) ప్రకారం.. ఫస్ట్ ఎయిడ్ బాక్సులో స్టెరిలైజ్డ్ ఫింగర్, హ్యాండ్, ఫూట్, బాడీ డ్రెసింగ్, రెండు పెద్ద, చిన్న బర్న్ డ్రెసింగ్‌లు, 15 గ్రాముల దూది, 2% టింక్చర్ అయోడిన్ సాల్ బొలటైల్ తదితరాలు తప్పకుండా ఉండాలి. అయితే, అందులో ఎక్కడా కండోమ్‌లు తప్పకుండా వెంట తీసుకెళ్లాలనే నిబంధన మాత్రం లేదు.
దీనిపై ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) తాజ్ హసన్ స్పందిస్తూ.. ''మోటర్ వెహికిల్ చట్టంలో ఎక్కడా కండోమ్‌లను ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో వాడాలనే నిబంధన లేదు. కండోమ్‌లు లేవనే కారణంతో ఎలాంటి జరిమానాలు విధించలేదు'' అని స్పష్టత ఇచ్చారు. అయితే, ఈ ఫేక్ వార్తను విని క్యాబ్ డ్రైవర్లు కండోమ్‌ల కోసం మెడికల్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.