Monday, October 7, 2019

ఆ వాట్సాప్ గ్రూప్‌లో చేరాలంటే 2 వేలు..! డ్రంకెన్ డ్రైవ్‌ల నుంచి తప్పించుకోవడానికి వాట్సాప్ గ్రూప్‌లు


హైదరాబాద్‌లో పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ బారి నుంచి తప్పించుకోవడానికి ఇటీవల వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు మందుబాబులు. మందు తాగాక తాము ఇళ్లకు వెళ్లే క్రమంలో ఒకసారి ఆ వాట్సాప్ గ్రూప్ చూస్తే చాలు.. ఏయే ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయనే సమాచారం అందులో కనిపిస్తుంది. దాంతో ఆ రూట్లో కాకుండా మరో మార్గంతో ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడానికి ఇప్పటికే చాలా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అయినట్లు పోలీసుల ద‌ృష్టికి రావడం గమనార్హం. 


ఇక కరీంనగర్‌లో మందుబాబులు మరింత అడ్వాన్స్‌గా ఉన్నారు. పోయిన సంవత్సరమే అక్కడ వాట్సాప్ గ్రూపుల లీలలు బయటపడ్డాయి. మందుబాబులు కలిసి క్రియేట్ చేసుకున్న వాట్సాప్ గ్రూపుల తాలూకు బండారం గుట్టురట్టు చేశారు పోలీసులు. ఆ వాట్సాప్ గ్రూపులో చేరాలంటే ఒక్కో సభ్యుడు రెండు వేల రూపాయలు చెల్లించాలనే నిబంధన కూడా పెట్టారట అడ్మిన్లు. అంతేకాదు కొన్ని నిబంధనలు కూడా విధించారు. ఆ గ్రూపుల్లో కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించిన సమాచారం మాత్రమే పోస్టులు పెట్టాలి. గుడ్ మార్నింగులు, తొక్క తోలు అంటూ అనవసర పోస్టులు పెడితే రెండు వందల రూపాయల ఫైన్ కూడా విధిస్తారట. ఒకవేళ ఆ ఫైన్ చెల్లించని పక్షంలో సదరు గ్రూప్ సభ్యులను ఎలిమినేట్ చేస్తారట. చూశారా టెక్నాలజీని ఎలా వాడేస్తున్నారో.. కలికాలం మరి..!