Wednesday, October 30, 2019

బంగారంపై మోదీ సర్కార్‌ షాకింగ్‌ నిర్ణయం



కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. తద్వారా ప్రపంచంలో బంగారం వినియోగంలో రెండవస్థానంలో ఉన్నదేశీయ వినియోగదారులకు షాకివ్వనుంది. వినియోగదారుల వద్ద లెక్కల్లోకి బంగారాన్ని వెలికి తీసేందుకు, నల్లధనాన్ని నిరోధించే లక్ష్యంతో మోదీ సర్కార్‌ భారీ ప్రణాళికలే రచిస్తోంది. వినియోగదారుల వద్ద బంగారాన్నిచట్టబద్ధం చేసే లక్ష్యంతో ఒక ప్రత్యేక పథకానికి శ్రీకారం చుడుతోందని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది మెరుగులు దిద్దుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గోల్డ్‌బోర్డు పేరుతో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయనుంది.


బంగారం నిల్వను ఒక నిర్దిష్ట పరిమితికికట్టడి చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం ఒక వ్యక్తి లేదా కుటుంబం బంగారం కలిగివుంటే పరిమితిని నిర్ణయిస్తారు. నిర్దేశించిన పరిమితికి మించి కలిగి ఉన్నవారికి భారీ జరిమానాలు విధిస్తారు. అయితే వివాహిత మహిళలనుఈ పథకం నుంచి మినహాయించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.


అంతేకాదు ప్రభుత్వం త్వరలో బంగారం కోసం రుణమాఫీ పథకాన్ని ప్రకటించవచ్చు. ఆదాయపు పన్ను రుణమాఫీ పథకం మాదిరిగానే, ఈ బంగారు రుణమాఫీ పథకం ఒక నిర్దిష్ట కాలానికిఅందుబాటులో ఉంటుంది. సరైన బిల్లులు లేకుండా బంగారంతో పట్టుబడిన వ్యక్తులు భారీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి వుంది.


గోల్డ్ బోర్డు
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రతినిధులతో 'గోల్డ్ బోర్డ్' ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక వ్యవహారాల శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా తయారు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికిగోల్డ్‌ బోర్డు సిద్ధం కానుంది. కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా ఉండటానికి,బంగారు హోల్డింగ్స్‌ను ఆర్థిక ఆస్తిగా అభివృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం ఈ ప్రతిపాదనలను సమీక్షిస్తారు.ఈ కొత్త ప్లాన్‌తో పాటు, ప్రస్తుత సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పునరుద్ధరించనున్నారు. నిజానికి ఈనెల(అక్టోబర్) 2వ వారంలోనే దీనిపై కేబినెట్‌లోనిర్ణయం తీసుకోవాల్సి వుంది. అయితేమహారాష్ట్ర, హర్యానారాష్ట్ర ఎన్నికల కారణంగావాయిదా పడింది. కాగా రెండేళ్ల క్రితమే ప్రభుత​ థింక్-ట్యాంక్ నీతిఆయోగ్ ఈ మేరకు సూచించడం గమనార్హం.


ప్రభుత్వ సావరిన్ బాండ్ పథకం వ్యక్తులు,హిందూ అవిభక్త కుటుంబాలు నాలుగు కిలోల వరకు బంగారాన్ని డీమాట్ రూపంలో కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. అదే ట్రస్టులకయితే20 కిలోల బంగారం కొనుగోలుకు అనుమతి ఉంది. దీనికి సంబంధించిన ఆరవ సిరీస్ అక్టోబర్ 25న ముగియగా, ఏడవ సిరీస్ డిసెంబర్ 2- 6 మధ్య ప్రారంభం కానుంది.



 





 




Wednesday, October 16, 2019

చెత్తకుప్పలో దొరికిన ఆడబిడ్డ


హైదరాబాద్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి సమీపంలో ఓ పసికందు చెత్తకుప్పలో లభ్యమైంది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా ప్లాస్టిక్ కవర్లో పసికందు కనిపించింది. ఆ పాపను వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతోనే చెత్తకుప్పలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పాపను వదిలి వెళ్లిన వారి కోసం గాలిస్తున్నారు.


Tuesday, October 15, 2019

RTC విలీనం సరికాదు, సమ్మె అసంబద్ధం.. - జేపీ.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో... లోక్ సత్తా నేత జయ ప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మె చేయడం సరికాదన్న ఆయన.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తిరోగమన చర్య అన్నారు.



తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రం అవుతోంది. అక్టోబర్ 19న తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇచ్చాయి. కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సీనియర్ నేత కేకే రంగంలోకి దిగారు. సమ్మెను వీడి విధుల్లో చేరి.. ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన ఆర్టీసీ కార్మికులను కోరారు. ఇలాంటి తరుణంలో.. లోక్‌సత్తా నేత జయ ప్రకాష్  నారాయణ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడారు. జగన్ సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరికాదన్న ఆయన.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తిరోగమన చర్య అని అభిప్రాయపడ్డారు. కార్మికులు ప్రజల కోసం పని చేయాలన్న జేపీ.. సమ్మెకు దిగడం కాకుండా.. నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపాలని సూచించారు. ఆర్టీసీ ప్రయివేట్‌తో పోటీ పడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
   ఓట్ల కోసం ఆర్టీసీని విలీనం చేయాలని నిర్ణయించడం     సరికాదన్న జేపీ.. ఆర్టీసీలో పోటీతత్వం పెంచాలన్నారు. ఆర్టీసీ మనుగడ కోసం రాయితీలు ఇవ్వాలన్న ఆయన.. విలీనం ఏమాత్రం సరికాదనడం గమనార్హం. గతంలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ ఖర్చుల విషయంలో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడారు.


Saturday, October 12, 2019

కుటుంబ సభ్యుల దారుణ హత్య


కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. దొమకొండ మండల కేంద్రంలోని మల్లయ్య దేవాలయం దగ్గర ఈ దారుణం జరిగింది. మృతులు చందన(5), లత(15), బాలయ్య బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్థి తగాదాల విషయంలో మృతుడు బాలయ్య తమ్ముడు రావి ఈ గాతుకానికి పాల్పడ్డాడని ప్రజలు అనుమానిస్తున్నా పోలీసులు మాత్రం హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు.


Thursday, October 10, 2019

ఆర్టీసీలో పీఎఫ్ సొమ్ము మాయం: ఏడు వేల దరఖాస్తులు పెండింగ్: కార్మికుల్లో ఆందోళన..!


తెలంగాణ ఆర్టీసీలో మరో కొత్త అంశం కార్మికులు వెలుగులోకి తెచ్చారు. ఆర్టీసీ పీఎఫ్ ఖాతా నుండి దాదాపు వెయ్యి కోట్లు మాయం అయినట్లు గుర్తించారు. కార్మికుల వేతం నుండి ప్రతీ నెల ఉద్యోగి భద్రత కింద పీఎఫ్ పేరుతో వసూలు చేసే మొత్తానికి అంతే మొత్తంలో యాజమాన్యం జమ చేస్తుంది. కానీ, తెలంగాణ ఆర్టీసీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగినట్లుగా కార్మికులు చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా రూ.826 కోట్లను పీఎఫ్‌ ఖాతాకు జమ చేయకుండా వాడేసుకుందని ఆరోపిస్తున్నారు. దీంతో..వివిధ కారణాలతో నగదు కోసం దరఖాస్తు ఏడు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వాపోతున్నారు. కార్మికుల సొమ్ము వెంటనే తమ ఖాతాలకు జమ చేయాలని తమ సమ్మె డిమాండ్లలో ఒక్కటిగా పేర్కొంటున్నారు. ఆర్టీసీలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి, అధికారి నెల వేతనం నుంచి యాజమాన్యం 12 శాతం పీఎఫ్ కింద కోత వేస్తుంది. దానికి యాజమాన్యం మరో 12 శాతం కలుపుతుంది. మొత్తం 24 శాతంలో 8.33 శాతం సొమ్ము పింఛను ఖాతాకు జమ చేస్తోంది. మిగతా 15.67 శాతానికి సంబంధించిన సొమ్మును పీఎఫ్‌ కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ట్రస్టు ఖాతాలో జమ చేయాలి. కానీ.. ఈ సొమ్ము ట్రస్టులో జమ కావడం లేదు. దీనిని ఆర్టీసీయే వాడేసుకుంటోంది. 2014 నుంచి మధ్య మధ్యలో కొంత జమ చేసినా.. ఇప్పటి వరకూ వాడేసుకున్న సొమ్ము రూ.826 కోట్లుగా తేలింది. కార్మికులకు సంబంధించిన పీఎ్‌ఫను ఏళ్ల తరబడి జమ చేయకపోవడంతో పీఎఫ్‌ కమిషనరేట్‌ రెండుసార్లు ఆర్టీసీకి షోకాజ్‌ నోటీసులు పంపింది. ఇలా ఆర్టీసీకి 2016లో ఒకసారి, 2017లో మరోసారి ఇలాంటి నోటీసులు వచ్చాయి. కేసులు నమోదయ్యాయి. అయినా, కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకుని మరీ ఆర్టీసీ యాజమాన్యం డబ్బు బదలాయించకుండా వాడేసుకుంటోంది. రెండేళ్ల నుంచి పీఎఫ్‌ విత్‌డ్రాయల్స్‌ నిలిచిపోయాయి. దీంతో, ఆగ్రహించిన పీఎఫ్‌ కార్యాలయం ఆర్టీసీని బ్లాక్‌ లిస్టులో పెట్టింది. అయినా.. సంస్థలో మార్పు లేదు. కార్మికుల సొమ్ముపై కించిత్తు ఆందోళన లేదు. సాధారణంగా కార్మికులకు పీఎఫ్‌ సొమ్మును డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ.. వారి పీఎఫ్‌ ఖాతాల్లో సొమ్ము లేకపోవడంతో ఆపత్కర సమయాల్లో డబ్బు విత్‌డ్రా చేసుకునే వీలుండడం లేదు. ఇప్పటి వరకూ 7000కుపైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.కార్మికులు చెబుతున్న సమాచారం మేరకు పీఎఫ్‌ సొమ్ము మాత్రమే కాదు.. సీసీఎస్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ పథకాల కింద కార్మికులు జమ చేసుకుంటున్న డబ్బును ఏళ్ల తరబడి ఆర్టీసీ సంస్థ అవసరాలకు మళ్లిస్తోందని వాపోతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ వెయ్యి కోట్లకుపైగా వాడుకున్నట్లు ఆర్టీసీ యూనియన్లు ధ్వజమెత్తుతున్నాయి. రిటైరైన సిబ్బందికి సెటిల్‌మెంట్‌ కింద చెల్లించే సొమ్మును కూడా వెంటనే ఇవ్వడం లేదనే ఫిర్యాదు ఉంది. ఇలా ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీలకు సంబంధించి రూ.1000 కోట్లను ఆర్టీసీ వాడుకుందని కార్మిక యూనియన్లు భగ్గుమంటున్నాయి.


Monday, October 7, 2019

ఆ వాట్సాప్ గ్రూప్‌లో చేరాలంటే 2 వేలు..! డ్రంకెన్ డ్రైవ్‌ల నుంచి తప్పించుకోవడానికి వాట్సాప్ గ్రూప్‌లు


హైదరాబాద్‌లో పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ బారి నుంచి తప్పించుకోవడానికి ఇటీవల వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు మందుబాబులు. మందు తాగాక తాము ఇళ్లకు వెళ్లే క్రమంలో ఒకసారి ఆ వాట్సాప్ గ్రూప్ చూస్తే చాలు.. ఏయే ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయనే సమాచారం అందులో కనిపిస్తుంది. దాంతో ఆ రూట్లో కాకుండా మరో మార్గంతో ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడానికి ఇప్పటికే చాలా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అయినట్లు పోలీసుల ద‌ృష్టికి రావడం గమనార్హం. 


ఇక కరీంనగర్‌లో మందుబాబులు మరింత అడ్వాన్స్‌గా ఉన్నారు. పోయిన సంవత్సరమే అక్కడ వాట్సాప్ గ్రూపుల లీలలు బయటపడ్డాయి. మందుబాబులు కలిసి క్రియేట్ చేసుకున్న వాట్సాప్ గ్రూపుల తాలూకు బండారం గుట్టురట్టు చేశారు పోలీసులు. ఆ వాట్సాప్ గ్రూపులో చేరాలంటే ఒక్కో సభ్యుడు రెండు వేల రూపాయలు చెల్లించాలనే నిబంధన కూడా పెట్టారట అడ్మిన్లు. అంతేకాదు కొన్ని నిబంధనలు కూడా విధించారు. ఆ గ్రూపుల్లో కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించిన సమాచారం మాత్రమే పోస్టులు పెట్టాలి. గుడ్ మార్నింగులు, తొక్క తోలు అంటూ అనవసర పోస్టులు పెడితే రెండు వందల రూపాయల ఫైన్ కూడా విధిస్తారట. ఒకవేళ ఆ ఫైన్ చెల్లించని పక్షంలో సదరు గ్రూప్ సభ్యులను ఎలిమినేట్ చేస్తారట. చూశారా టెక్నాలజీని ఎలా వాడేస్తున్నారో.. కలికాలం మరి..!


ఆర్టీసీ నష్టాలకు కారణం ఎవరు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర విశ్లేషణ

ఆర్టీసీ నష్టాలకు కారణం ఆ సంస్థా, లేకపోతే కార్మికులా.. ప్రభుత్వ విధానాల వల్ల ఆర్టీసీ ఏ లెవల్లో నష్టపోతోంది? ప్రొఫెసర్ నాగేశ్వర్ సూచనలు పాటిస్తే.. నష్టాలు పోగా, ఎంత పెద్ద మొత్తం మిగులుతుంది?



ర్టీసీ కార్మికులు జీతాలు పెంచాలంటూ ఆందోళన చేసిన ప్రతిసారి చర్చకు వచ్చే అంశం.. సంస్థ నష్టాల్లో ఉందని. నష్టాలు వస్తుంటే జీతాలు ఎలా పెంచుతామని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. మరి ఆర్టీసీ నిజంగానే నష్టాల్లో ఉందా.. ఉంటే అందుకు కారణం ఎవరు? ఈ అంశాలపై మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆ వివరాలు.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఆర్టీసీకి ఉన్న అప్పులు రూ.300 కోట్లు. సంస్థకు ఏడాదికి వస్తున్న నష్టం రూ.700 కోట్లు. మోటార్ వెహికల్ ట్యాక్స్ కింద ప్రభుత్వానికి ఆర్టీసీ ఏటా సరాసరి రూ.200 కోట్లు చెల్లిస్తోంది. ప్రస్తుతం అది రూ.240 కోట్లకు చేరుకుంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరేళ్లలో ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించిన పన్నుల మొత్తం రూ.1200 కోట్లకు పైమాటే. మరి.. ఆర్టీసీపై పన్ను వేయడం సరైన చర్యేనా? ప్రైవేట్ కార్లు, ఇతర వాహనాలపై వేయొచ్చు గానీ.. ఆర్టీసీ బస్సులపై ట్యాక్స్ వేస్తారా? పాఠశాలలపై పెట్టే ఖర్చు (పబ్లిక్ ఎడ్యుకేషన్) మీద పన్నులు వేయట్లేదు. ప్రజా ఆరోగ్యం విషయంలో చేసే ఖర్చులపై పన్నులు వేస్తున్నారా? ప్రభుత్వ ఆస్పత్రులపై ట్యాక్స్‌లు వేస్తున్నారా? వ్యాపారాలు, సంపాదనపై ట్యాక్సులు వేస్తారు. పన్నులు వేయడానికి ఆర్టీసీది కమర్షియల్ యాక్టివిటీ కాదు. విలాస వస్తువో, వ్యాపారమో అంతకన్నా కాదు. ఆర్టీసీ అనేది పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు.. అంటే ఇది కూడా ప్రజా సదుపాయం. ప్రజలకు సదుపాయం కల్పించే ఆర్టీసీపై పన్ను వేయడం సరికాదు. ఏటా రూ.240 కోట్ల పన్ను వేస్తూ.. రూ.700 కోట్ల నష్టం అని ఎలా చెబుతారు?ఇక ఆర్టీసీ వినియోగిస్తున్న డీజీల్‌పై ఏటా విధిస్తున్న పన్ను రూ.516 కోట్లు. కేంద్రం ఎక్సైజ్, వ్యాట్ కలుపుకొని ఈ మొత్తం రూ.590 కోట్లు అవుతోంది. ఇందులో రూ.200 కోట్లకు పైగా రాష్ట్రానికి తిరిగి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు లేకుండా ఆర్టీసీకి ఇంధనం ఎందుకు సరఫరా చేయవు?  మోటార్ వెహికల్ ట్యాక్స్ రూ.240, ఇంధన ట్యాక్స్ రూ.590 లేకపోతే ఆర్టీసీకి ఏటా రూ.700 కోట్లకు పైగా మిగులు ఉంటుంది కదా.. నష్టాలు లేకపోగా, లాభాలు ఉంటాయి కదా. రైల్వేలను ప్రజా రవాణాగా గుర్తించి ట్యాక్సులు రద్దు చేసినప్పుడు.. ఆర్టీసీకి రాయితీ ఎందుకు ఇవ్వరు?తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో డీజిల్ ధర రూ.40, ప్రస్తుతం రూ.70 పైనే ఉంది. అంటే పెరిగిన ఇంధన ధరల కారణంగా ఆర్టీసీకి కిలోమీటర్‌కు 5 రూపాయల చొప్పున అదనంగా ఖర్చవుతోంది. ఆర్టీసీ బస్సులు రోజుకు సరాసరి 36 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. అంటే ఈ లెక్కన రోజుకు కోటీ 80 లక్షల రూపాయల నష్టం వస్తోంది. డీజిల్ ధరలు పెరగడానికి ఆర్టీసీ యాజమాన్యమో, ఉద్యోగులో బాధ్యులా? పైగా మన దగ్గర అంతర్జాతీయ మార్కెట్ రేట్ల కంటే అధికంగా డీజిల్, పెట్రోలు ధరలు ఉన్నాయి.. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే కారణం.  ఇక ఆర్టీసీ కొనుగోలు చేసే విడి భాగాలపై ఏటా రూ.100 జీఎస్టీ భారం పడుతోంది. టైర్లు, ఇతర వాహన భాగాల కొనుగోళ్లపై విధించే పన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే చేరుతోంది.ఆర్టీసీ అప్పులకు మరో కారణం.. సంస్థ అందించే రాయితీలు. స్టూడెంట్స్ పాసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులకు ఉచితంగా ఇచ్చే రాయితీల సొమ్ము అంతా కలిపి.. తెలంగాణ ఏర్పటైన తర్వాత మొదటి నాలుగేళ్లలో రూ.2208 కోట్లు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చింది కేవలం రూ.500 కోట్లు. ఆర్టీసీకి ఇంకా రూ.1700 కోట్లు చెల్చించాల్సి ఉంది. ఈ నిధులు చెల్లించకుండా సంస్థకు లోన్లు ఇప్పిస్తూ, అప్పులపై వడ్డీలు కట్టిస్తోంది. ఆర్టీసీకి సొంతంగా టైర్ల యూనిట్ ఎందుకు ఏర్పాటు చేయరు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మంగళగిరిలో టైర్ల యూనిట్ ఏర్పాటు చేయడానికి కసరత్తు జరిగింది. ఆ తర్వాత ఆ అంశానికి అతీగతీ లేదు. ఆర్టీసీకి సొంత టైర్ల యూనిట్ ఎందుకు పెట్టరు? ఎందుకంటే.. అధికారులకు కమీషన్ రాదు. ప్రైవేట్ అయితే.. సొమ్ములు దండుకోవచ్చు.
ఆర్టీసీకి సొంతంగా టైర్ల యూనిట్‌ను ఏర్పాటు చేస్తే ఏటా వందల కోట్ల రూపాయలను ఆదా చేసుకోవడమే కాకుండా.. ప్రైవేట్ వాహనాలకు కూడా అమ్ముతూ అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఇక ఆర్టీసీ ఆస్తులను కమర్షియల్‌గా అభివృద్ధి చేసుకోవడం మరో ప్రత్యామ్నాయం.


ఆస్తులను అలా వాడుకుంటే..
ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆస్తులు ఉన్నాయి. వాటిలో హోటళ్లు, మల్టీఫ్లెక్స్‌లు, షాపింగ్ మాళ్లు తదితరాలను అభివృద్ధి చేయవచ్చు. తద్వారా మరింత ఆదాయం సమకూరుతుంది. ఇలాంటి ప్రదేశాల్లో అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారానూ మరింత ఆదాయం వస్తుంది. ఇక కొరియర్ ట్రాన్స్‌పోర్టు, అన్ని రకాల వస్తువుల రవాణా ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఇలా ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచడానికి అనేక మార్గాలు అన్వేషించవచ్చు.రెవెన్యూ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, బస్సు సర్వీస్‌ల విషయంలో ఆర్టీసీకి దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి ఏపీలోనే మంచి ట్రాక్ రికార్డు ఉంది. పాత బస్సులను నడుపుతూ కూడా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. విడి భాగాలపై చేసే ఖర్చు కూడా చాలా తక్కువ. మొత్తంమీద గ్రహించాల్సిన విషయం ఏమిటంటే.. ఆర్టీసీ నష్టాలకు కారణం ఆ సంస్థ కాదు, ఉద్యోగుల అసమర్థత అంతకన్నా కాదు.. ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు, రాయితీలు చెల్లించకపోవడం తదితరాలు ఈ నష్టాలకు కారణం. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఉద్యోగులను బలిపెట్టడం న్యాయమా? అనేది చర్చనీయాంశం.


 


Saturday, October 5, 2019

భారత్, పాక్ అణుయుద్ధం.. 10 కోట్ల ప్రాణ నష్టం: అధ్యయనంలో విస్తుగొలిపే నిజాలు!

దాయాదుల మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాలోని ఓ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనం కీలక అంశాలను వెలువరించింది. భారత్, పాక్ మధ్య అణుయుద్ధానికి దారితీసే పరిస్థితులు వివరించింది.



ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధమే జరిగితే కనీసం 10 కోట్ల కంటే ఎక్కువ మంది తక్షణమే చనిపోతారని ఓ నివేదిక హెచ్చరించింది. అంతేకాదు, వాతావరణంపై పెను ప్రభావం చూపి దశాబ్ద కాలంపాటు సూర్యుడి చుట్టూ పొగ అలముకుని తీవ్ర కరువు తాండవిస్తుందని వెల్లడించింది. అమెరికాలోని రుట్గర్స్ యూనివర్సిటీకి చెందిన ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ విభాగం చేపట్టి అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసింది. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకున్న ఉద్రిక్తతలు అణుయుద్ధానికి దారితీస్తే కలిగే పరిణామాలను ఊహించి తమ నివేదికలో పొందుపరిచారు.

భారత్, పాక్‌ల మధ్య పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారని, ఈ ఘటనలో అనేక మంది నాయకులు చనిపోతారని తెలిపింది. దీనికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ దాడిచేస్తుందని ప్రాకల్పన చేసింది. పీఓకేను దాటి తమ భూభాగంలోకి భారత్ వస్తుందనే భయంతో పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని, దీంతో చరిత్రలో అత్యంత ఘోరమైన యుద్ధానికి దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేసింది.


దీని ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి, భూమి అత్యంత శీతలంగా మారిపోతుందని తెలిపింది. ఇరు దేశాల్లో ఒక్కొక్కరి వద్ద కనీసం 150 వరకు అణ్వాయుధాలు ఉన్నాయని, 2025 నాటికి ఇవి 200 పైచిలుకు చేరుకుంటాయని అంచనా వేసింది. దురదృష్టవశాత్తు భారత్, పాకిస్థాన్ మధ్య కశ్మీర్ గురించి వివాదం నడుస్తోందని, సరిహద్దుల్లో ప్రతి నెలా అనేక మంది చనిపోతున్న విషయం చదువుతున్నామని ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ అలెన్ రొబొక్ వ్యాఖ్యానించారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దుచేసిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని పలుసార్లు అణు యుద్ధం గురించి ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితిలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోకి భారత్ చొచ్చుకెళ్లి అక్కడ ఉగ్రవాద శిబిరంపై ఎయిర్ స్ట్రయిక్స్‌ జరిపింది. అనంతరం జరిగిన పరిణామాలతో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, క్రమంగా ఉద్రిక్తతలు సద్దుమణగడంతో సాధారణ పరిస్థితులు నెలకున్నాయి.

తొలుత అణ్వాయుధాలను ప్రయోగించమనే నియమానికి తాము కట్టుబడి ఉంటామని, ఒకవేళ పరిస్థితి చేజారితే దీనిలో సడలింపు ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. సాంప్రదాయ యుద్ధంలో నిలువరించకపోతే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. వీటిని ప్రస్తావించిన పరిశోధన బృందం.. తొలుత అణ్వాయుధాలను పాకిస్థాన్ ప్రయోగించే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేసింది.

ఒకవేళ ఇరు దేశాలూ అణ్వాయుధాలను ఉపయోగిస్తే కనీసం 125 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధంలో 75 నుంచి 80 మిలియన్ల మంది చనిపోగా, 100 కిలోటన్నుల అణు బాంబులను వినియోగించారు. హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబుకు ఇవి ఆరు రెట్లు అధికం. ఒక్క అణు బాంబును జారవిడచడం వల్ల రెండు మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోగా, 1.5 మిలియన్ల మంది గాయపడ్డారు. కానీ, పేలుడు జరిగిన తర్వాత ఎగిసిపడిన మంటల వల్లే అధిక ప్రాణనష్టం సంభవించింది.

'అణు యుద్ధమే జరిగితే పాకిస్థాన్ కంటే భారత్‌లోనే మృతులు, క్షతగాత్రల సంఖ్య రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంటుంది.. ఎందుకంటే మా అంచనా ప్రకారం పాకిస్థాన్ అణ్వాయుధాలను ఎక్కువగా ప్రయోగిస్తుందని, అధిక జనాభా కలిగిన నగరాలు భారత్‌లోనే ఎక్కువని' అన్నారు. అణ్వాయుధాల ప్రయోగం తర్వాత ఎగిసిపడే మంటల వల్ల 16 మిలియన్ల నుంచి 36 మిలియన్ టన్నుల దట్టమైన పొగలు వెలువడతాయి. ఇవి ఆకాశంలో అలుముకుని, ప్రపంచమంతా వారం వ్యవధిలోనే ఆవహిస్తాయని పరిశోధకులు వివరించారు.

ఇది సౌర వికిరణాన్ని గ్రహించడం వల్ల గాలి వేడెక్కి, దట్టమైన పొగలు మరింత పెరుగుతాయి. దీంతో భూమిపైకి వచ్చే సూర్యరశ్మి 20 నుంచి 35 శాతం వరకు తగ్గిపోతుందని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు, అవపాతం 15 నుంచి 30 శాతం పడిపోతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహారం కొరత తీవ్రంగా ఉండి, పదేళ్ల వరకు దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అణ్వాయుధ వినియోగానికి దూరంగా ఉండాలని వారు సూచించారు.


Wednesday, October 2, 2019

ఒక్క రూపాయికే ఎకరం భూమా? కేసీఆర్ సర్కారుకు హైకోర్టు నోటీసులు


కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోట్ల రూపాయల విలువైన భూమిని అత్యంత చౌకగా ఎలా కేటాయిస్తారంటూ మండిపడింది. హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి భూముల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు వివరణ కోరింది. ఎకరం రూపాయి చొప్పున శారదా పీఠానికి రెండు ఎకరాలు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేవలం రూపాయికే ఎకరం భూమిని కట్టబెట్టడంలో ప్రభుత్వ వైఖరి ఏంటో తెలపాలని ఆదేశించింది.


2019 జూన్ 22న హైదరాబాద్ కోకాపేటలో రెండెకరాలను ఎకరం రూపాయి చొప్పున శారదా పీఠానికి కేటాయిస్తూ టీఆర్ఎస్ సర్కారు జీవో 71 జారీ చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని, జీవో 71ను సవాలు చేస్తూ, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కోకాపేటలో ఎకరం భూమి కోట్లల్లో ఉందని, అలాంటిది కేవలం ఒక్క రూపాయికే ఎలా కట్టబెడతారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో 71ను కొట్టివేసి, శారదా పీఠానికి చేసిన భూకేటాయింపులను రద్దుచేయాలని పిటిషనర్ కోరాడు. దాంతో శారదా పీఠానికి భూముల కేటాయింపుపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ కోర్టు ఆదేశించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోపాటు శారదాపీఠం ధర్మాధికారికి నోటీసులసు ఇచ్చింది.


జియో దీపావళి కానుక: రూ.699కే జియో ఫోన్‌



సాంకేతికంగా అనుసంధానం కొన‌సాగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో... అందుబాటు ధ‌ర‌లో ఇంట‌ర్నెట్ ల‌భ్య‌మ‌వ‌డం అనేది కూడు, గుడ్డ మ‌రియు నీడ వ‌లే మ‌నుషుల కనీస అవ‌స‌రం మ‌రియు ప్రాథ‌మిక‌ హ‌క్కుగా మారిపోయింది. అందుకే, దేశ‌వ్యాప్తంగా జియో ద్వారా అందిస్తున్న వాయిస్ కాలింగ్ సేవ‌ల‌కు తోడుగా, డాటా సేవ‌ల‌ను సైతం అవ‌స‌రం ఉన్న ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి జియో చేరువ చేసింది. 


 


 

ఇత‌ర పోటీదారులు నాసిర‌క‌మైన 2జీ డాటాను అందిస్తూ ఒక జీబీ డాటాకు రూ.500 వ‌సూలు చేస్తున్న త‌రుణంలో, అత్యంత నాణ్య‌మైన 4జీ డాటాను అత్యుత్త‌మ‌మైన 4జీ నెట్‌వ‌ర్క్‌తో అందుబాటు ధ‌ర‌లో జియో అందించింది. ఇంతేకాకుండా, ప్రపంచంలోనే అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన 4జీ సేవ‌ల ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను సాధార‌ణ భార‌తీయులంద‌రు ఉప‌యోగించుకునేలా జియో చేయ‌గ‌లిగింది.


 


 

ప్ర‌తి ఒక్క భార‌తీయుడు గ‌ర్వంగా తెలుసుకోవాల్సిన విష‌యం ఏమిటంటే... జియో స్మార్ట్‌ఫోన్ ఒక్క‌టే భార‌త‌దేశంలో త‌యార‌వుతోంది. భార‌తీయులచే త‌యారవుతోంది, భార‌తీయుల కోసం రూపొందించ‌బ‌డుతోంది మరియు భార‌త‌దేశం యొక్క ఆపరేటింగ్ సిస్ట‌మ్‌ను క‌లిగి ఉన్న ఏకైక స్మార్ట్‌ఫోన్‌. ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ల‌తో పోలిస్తే నాలుగో వంతు ధ‌ర‌లోనే రూ. 1500 జియోఫోన్ అందుబాటులోకి వ‌స్తోంది.


 

 


 

జియోఫోన్ అందుబాటులోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు, దాదాపు 7 కోట్ల మంది 2జీ వినియోగ‌దారులు జియో ఫోన్ ప్లాట్‌ఫాంను వినియోగించుకుంటున్నారు. తద్వారా శ‌క్తివంత‌మైన డిజిట‌ల్ సేవ‌ల‌ను పొంద‌గ‌లుగుతున్నారు. అయిన‌ప్ప‌టికీ, డిజిట‌ల్ ఇండియా యొక్క క‌ల పూర్తిగా నెర‌వేరాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది.


 


 

ఎందుకంటే, ప్ర‌స్తుతం భార‌త‌దేశంలోని దాదాపు 35 కోట్ల‌కు పైగా ప్ర‌జ‌లు నేటికి 2జీ నెట్‌వ‌ర్క్‌ను వినియోగిస్తున్నారు మ‌రియు వారికి స్మార్ట్‌ఫోన్ సేవ‌లు అందుబాటులో లేవు. వారు పేద‌రికం బాధితులుగా ఇంకా మిగిలిపోవ‌డం వ‌ల్ల... అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన జియోఫోన్ సైతం వారికి అందుబాటులో లేదు. ఈ 35కోట్ల 2జీ వినియోగ‌దారులు ముందు ప్ర‌స్తుతం అతి సంక్లిష్ట‌మైన స్థితి ఉంది. డాటా స‌ర్వీసుల‌పై ఆశ‌లు వ‌దిలేసుకోవ‌డం లేదా నాణ్య‌త‌లేని 2జీ డాటా సేవ‌ల కోసం అత్యంత ఎక్కువ ధ‌ర‌ను చెల్లించ‌డం మాత్ర‌మే వారి ముందున్న అవ‌కాశం. ఇంతేకాకుండా వారు ఉచిత వాయిస్ కాల్స్ ప్ర‌యోజ‌నాలు పొంద‌లేక‌పోతున్నారు, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను వినియోగించుకోలేక‌పోతున్నారు.


 

 


 

ఈ నేప‌థ్యంలో జియో మ‌రో భారీ అడుగు వేస్తూ భార‌తీయులంద‌రినీ డిజిట‌ల్ విప్ల‌వంలో భాగం చేసుకునేందుకు ముందుకు సాగుతోంది. ప్ర‌త్యేక‌మైన మ‌రియు ఒకేసారి మాత్ర‌మే ల‌భ్య‌మ‌య్యే ఆఫర్‌ను `జియో ఫోన్ దీపావ‌ళి 2019 ఆఫ‌ర్‌` పేరుతో జియో నేడు ప్ర‌క‌టించింది. ద‌స‌రా మ‌రియు దీపావ‌ళి పండుగ స‌మ‌యంలో, జియో ఫోన్ ప్ర‌స్తుత ధ‌ర రూ.1500 కాకుండా ప్ర‌త్యేక ధ‌ర కింద‌ కేవ‌లం రూ. 699కే జియో ఫోన్ అందుబాటులో ఉంచుతోంది. అంటే రూ.800 ఒకేసారి పొదుపు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకోవ‌డం వంటి ప్ర‌త్యేకమైన ష‌ర‌తులు ఏవీ విధించ‌క‌పోవ‌డం దీనియొక్క మ‌రో ప్ర‌త్యేక‌త‌.


 


 

ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 2జీ ఫీచ‌ర్ ఫోన్ల కంటే కూడా ఈ ధ‌ర ఎంతో త‌క్కువ కావ‌డం విశేషం. త‌ద్వారా, ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారులు శ‌క్తివంత‌మైన 4జీ సేవ‌ల‌ను పొందేందుకు ఉన్న చివ‌రి అడ్డంకి సైతం ఈ రూపంలో దూరం చేయ‌డం సాధ్య‌మైంది. రూ.700కు సంబంధించి, జియో ఫోన్ వినియోగ‌దారులు ఆ మొత్తంతో జియో ఫోన్ కొనుగోలు చేసి 2జీ నుంచి 4జీ డాటా ప్ర‌పంచంలోకి మారిపోవ‌చ్చు. ఇదే స‌మ‌యంలో, జియో సైతం త‌న‌వంతు పెట్టుబ‌డిని పెడుతున్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌ద్వారా, భార‌త‌దేశంలోని అర్హ‌త క‌లిగిన వ‌ర్గాల‌న్నింటినీ ఇంట‌ర్నెట్ ఎకాన‌మీలో భాగస్వామ్యం అయ్యేందుకు జియో పెట్టుబ‌డి పెట్టడంతో పాటుగా అంకిత‌భావంతో కృషి చేస్తోంది. 


 

 


 

జియో ఫోన్ వినియోగ‌దారుల విష‌యానికి వ‌స్తే, దీపావ‌ళి 2019 ఆఫ‌ర్ వినియోగించుకోవాల‌ని భావిస్తే, రూ.700 విలువైన డాటా ప్ర‌యోజ‌నాల‌ను జియో వారికి అందిస్తోంది. ఆ వినియోగ‌దారుడు చేసుకున్న మొద‌టి ఏడు రీచార్జ్‌ల‌కు రూ.99 విలువైన డాటాను జియో అధ‌నంగా జ‌త‌చేయ‌నుంది. 


 


 

జియోఫోన్ వినియోగ‌దారుల‌కు అధ‌నంగా అందే ఈ రూ.700 డాటాతో జియో వినియోగ‌దారులు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పేమెంట్స్‌, ఈకామ‌ర్స్‌, విద్య, శిక్ష‌ణ‌, రైల్లు మ‌రియు బ‌స్ బుకింగ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మ‌రియు మ‌రెన్నో అంశాల‌కు సంబంధించిన మునుపెన్న‌డూ లేని అనుభూతుల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.


 


 

జియో ఫోన్‌పై పొదుపు చేసుకునే రూ.800 మ‌రియు రూ.700 విలువైన డాటా, మొత్తం క‌లిపి రూ.1500 భారీ ప్ర‌యోజ‌నం ప్ర‌తి జియో ఫోన్ వినియోగ‌దారుడికి సొంతం అవుతుంది. ఈ రూ. 1500 లాభం డిజిట‌ల్ ఇండియా క‌ల సాకారం చేసుకోవ‌డంలో భాగంగా జియో అందిస్తున్న దీపావ‌ళి కానుక‌. ఈ పండుగ మాసంలో జియో ద్వారా అందించే ఒక్కసారి మాత్రమే ల‌భ్య‌మ‌య్యే ఈ ఆఫ‌ర్‌ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, భార‌త‌దేశంలో 2జీ సేవ‌లను వినియోగిస్తున్న వారు దాని నుంచి అప్‌గ్రేడ్ అయి జియో ఫోన్ ప్లాట్‌ఫాంకు చేరువ కావాల‌ని జియో ఆహ్వానిస్తోంది. 


 


 

శ్రీ ముఖేష్ అంబానీ, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాలు పంచుకుంటూ, ``అందుబాటు ధ‌ర‌లో చేరువ‌గా ఉన్న‌ ఇంట‌ర్నెట్ పొందేందుకు భార‌తదేశంలోని ఏ ఒక్క‌రికి డ‌బ్బు స‌మ‌స్య‌గా మార‌కూడ‌దని మ‌రియు డిజిట‌ల్ విప్ల‌వం యొక్క ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోకుండా ఉండాల‌ని జియో కృషి చేస్తుంది``అని స్ప‌ష్టం చేశారు. ``జియో ఫోన్ దీపావ‌ళి కానుక అందించ‌డం ద్వారా మేం ప్ర‌తి ఒక్క వినియోగ‌దారుడిపై రూ.1500ను పెట్టుబ‌డిగా పెట్టి ఆ కొత్త వ్య‌క్తి ఇంట‌ర్నెట్ ఎకాన‌మీలోకి ఆర్థిక కార‌ణాల వ‌ల్ల చేరుకోలేక‌పోయిన స్థితిని దూరం చేస్తున్నాం. మ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గారి యొక్క డిజిట‌ల్ ఇండియా మిష‌న్ క‌ల‌ను నెర‌వేర్చేందుకు మేం అందిస్తున్న మ‌ద్ద‌తుగా కూడా భావించ‌వ‌చ్చు`` అని వెల్ల‌డించారు.


Tuesday, October 1, 2019

అన్ని గ్రూప్‌లకు ఒకే బ్లడ్.. కృత్రిమ రక్తాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు

అద్భుతం.. ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి అవసరమైన కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. దీన్ని ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తికైనా ఎక్కించవచ్చు.


జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల తొకోరోజవా నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్‌లో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణ రక్తం తరహాలోనే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్ర రక్త కణాలు, రక్తాన్ని గడ్డ కట్టించే ప్లేట్‌లెట్స్‌ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని విజయవంతంగా ప్రయోగించారు.



క్తంలో ఎన్నో రకాల గ్రూప్‌లు ఉన్న సంగతి తెలిసిందే. ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు.. తప్పకుండా వారి గ్రూప్ తెలుసుకుని.. అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కించాల్సి వస్తోంది. అలాగే, అన్ని గ్రూప్‌లకు సరిపోయే రక్తం గల వ్యక్తులు కూడా అంతా సులభంగా లభించరు. ముఖ్యంగా రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత కష్టం. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల తొకోరోజవా నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్‌లో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణ రక్తం తరహాలోనే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్ర రక్త కణాలను, చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్‌ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. వీటిలో ఆరు ప్రాణాలతో ఉండగా నాలుగు చనిపోయాయి.


    కుందేళ్ల ప్రాణం నిలిపిన ఈ కృత్రిమ రక్తం  మనుషులకు సైతం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం కోసం రోడ్, ఎయిర్ అంబులెన్స్‌లలో O -ve (ఒ-నెగటివ్) రక్తాన్ని తీసుకెళ్తున్నారు. ఈ రక్తం అన్ని గ్రూప్‌లకు సరిపోతుంది. దీంతో ఈ రక్తాన్ని యూనివర్శల్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. అయితే, ఈ గ్రూపు రక్తం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో డిమాండుకు తగిన సప్లై లేక పోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ శాస్త్ర వేత్తలు కనిపెట్టిన ఈ కృత్రిమ రక్తం తప్పకుండా మేలు చేకూర్చనుందని భావిస్తున్నారు.


    దాతల రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను అటూ ఇటూ కదపడం ద్వారా కేవలం 4 రోజులు మాత్రమే నిలవ ఉంచగలం. అలాగే, రక్తాన్ని తక్కువ ఉష్ణోగ్రతల్లో నిలువ చేసినా కూడా 20 రోజుల్లో దాని స్వభావం మారిపోతుంది. అయితే, శాస్త్రవేత్తలు రూపొందించిన కృత్రిమ రక్తం ఏడాదిపాటు నిలువ ఉంటుందని తెలుపుతున్నారు. ఈ రక్తాన్ని ఎక్కించిన తర్వాత కుందేళ్లలో ఎలాంటి సైట్ ఎఫెక్ట్‌లు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రక్తం మనుషులపై కూడా సక్రమంగా పనిచేస్తే.. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు నిలుస్తాయి.


 


కండోమ్ ఉంటే చలానా వేయరట.. క్యాబ్ డ్రైవర్లకు కొత్త రూల్..?

ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోడానికి క్యాబ్ డ్రైవర్లు కండోమ్ ప్యాకెట్ల కోసం మెడికల్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.


* క్యాబ్ లేదా ట్యాక్సీల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పకుండా ఉండాలనే నిబంధన ఉంది.


* ఆ బాక్సులో ఫస్ట్ ఎయిడ్(ప్రథమ చికిత్స) కిట్‌తో పాటు కండోమ్‌లు ఉన్నట్లయితే పోలీసుల నుంచి తప్పించుకోవచ్చని డ్రైవర్లు తెలుపుతున్నారు.


* అయితే, ఢిల్లీ పోలీసులు దీన్ని ఖండించారు. అలాంటి నిబంధన ఏదీ చట్టంలో లేదన్నారు.



ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే పోలీసులు ఎలాంటి చలానా విధించరని తెలుసు. కానీ, కండోమ్‌ ఉంటే చలానా ఎందుకు వేయరు? కండోమ్‌కు.. ట్రాఫిక్ నిబంధనలను లింకేమిటీ అనేగా మీ సందేహం. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు పాటిస్తున్న ఈ వింత నిబంధన గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే. 


'ఆ కిట్‌లో కండోమ్ ఉండాల్సిందే': క్యాబ్ లేదా ట్యాక్సీల్లో  ఫస్ట్ ఎయిడ్ బాక్స్  తప్పకుండా ఉండాలనే నిబంధన ఉంది. అది ఖాళీగా ఉన్నట్లయితే ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తారు. అయితే, ఆ బాక్సులో ఫస్ట్ ఎయిడ్(ప్రథమ చికిత్స) కిట్‌‌ ఉన్నా కండోమ్‌లు లేకపోతే పోలీసుల చలానా వేస్తున్నారని డ్రైవర్లు తెలుపుతున్నారు. ''కండోమ్‌లు ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో ఎందుకు పెట్టాలనేది తెలీదు. కానీ, అవి లేకపోతే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అందుకే, పెడుతున్నాం'' అని ఓ డ్రైవర్ వెల్లడించాడు.


చట్టం ఏం చెబుతోంది: ఢిల్లీ వెహికిల్స్ రూల్స్ (1993) ప్రకారం.. ఫస్ట్ ఎయిడ్ బాక్సులో స్టెరిలైజ్డ్ ఫింగర్, హ్యాండ్, ఫూట్, బాడీ డ్రెసింగ్‌, రెండు పెద్ద, చిన్న బర్న్ డ్రెసింగ్‌లు, 15 గ్రాముల దూది, 2% టింక్చర్ అయోడిన్ సాల్ బొలటైల్ తదితరాలు తప్పకుండా ఉండాలి. అయితే, అందులో ఎక్కడా కండోమ్‌లు తప్పకుండా వెంట తీసుకెళ్లాలనే నిబంధన మాత్రం లేదు.


దీనిపై ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) తాజ్ హసన్ స్పందిస్తూ.. ''మోటర్ వెహికిల్ చట్టంలో ఎక్కడా కండోమ్‌లను ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో వాడాలనే నిబంధన లేదు. కండోమ్‌లు లేవనే కారణంతో ఎలాంటి జరిమానాలు విధించలేదు'' అని స్పష్టత ఇచ్చారు. అయితే, ఈ ఫేక్ వార్తను విని క్యాబ్ డ్రైవర్లు కండోమ్‌ల కోసం మెడికల్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.


నర్సరీ, ఎల్‌కేజీ టాపర్లా.. నెటిజన్ల తీవ్ర విమర్శలు..


10, 10, 9.8, 9.7.. నర్సరీ విద్యార్థుల ప్రభంజనం.. 10, 10, 10 ఫస్ట్ క్లాస్ టాపర్స్.. ఎల్‌కేజీ విద్యార్థుల ర్యాంకుల పంట, యూకేజీ టాపర్స్.. టీవీ ఛానళ్లలో ఇలా నర్సరీ విద్యార్థుల ర్యాంకుల పంట అంటూ ప్రకటనలు హోరెత్తించినా ఆశ్చర్యపోవద్దు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలకు కూడా ర్యాంకులా.. విడ్డూరం కాకపోతేనూ అంటారా.. అవును మరి. మన ప్రైవేట్ స్కూళ్ల మధ్య పోటీతో చదువు'కొనడం' చివరికి ఇలా తయారైంది. అది కూడా మన రాజధాని హైదరాబాద్‌లోనే.

భాగ్యనగరంలోని కొత్తపేటలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ తమ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల ర్యాంకులు, గ్రేడింగ్‌లతో ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేయించింది. నర్సరీలో 10 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణులు కాగా.. వారిలో ఇద్దరికి పదికి పది పాయింట్లు వచ్చాయని ఘనంగా చెప్పుకుంది. ఇక ఎల్‌కేజీలో 14 మంది, యూకేజీలో 11 మంది, ఒకటో తరగతిలో 9 మంది ఫస్ట్ క్లాస్‌తో పాసయ్యారని రాసుకొచ్చిందివిద్యార్థుల పేర్లను ఫొటోలు సహా బిల్‌బోర్డుపైకి ఎక్కించిన సదరు పాఠశాల యాజమాన్యం తీరు చర్చనీయాంశంగా మారింది. పాఠశాల నిర్వాకానికి సంబంధించిన ఫొటోను ఆదివారం (సెప్టెంబర్ 29) ఓ నెటిజన్‌ ట్విటర్‌ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ పిల్లలు వేగంగా పాలు తాగడంలో టాపర్లా అంటూ కామెంట్ పెట్టారు.

నెటిజన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాఠశాల తీరుపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే నర్సరీ విద్యార్థుల ఆత్మహత్యలను చూడటానికి ఎంతో కాలం పట్టదని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలను విద్యార్థులుగా భావించరనే కనీస ఇంగితజ్ఞానం కూడా లేదంటూ మరికొంత మంది నెటిజన్లు సదరు పాఠశాలపై దుమ్మెత్తి పోశారు. వారి మార్కెట్‌ను పెంచుకోవడానికి పిల్లలేమీ వస్తువులు కాదంటూ మండిపడుతున్నారు. ఇలాగైతే చిన్నపిల్లల్లోనూ ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుందని కొంత మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్కూల్‌కు సంబంధించిన ఫోటోను వాట్సాప్‌లోనూ షేర్ చేసుకుంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


ఈ అంశంపై ఇటు పాఠశాల యాజమాన్యం కానీ, అటు విద్యాశాఖ అధికారులు కానీ స్పందించలేదు. తల్లిదండ్రులూ.. ఇలాంటి పాఠశాలల మాయలో పడి మీ పిల్లల జీవితాన్ని అంధకారంలో పడేయ్యొద్దు, వారిని ఒత్తిడిలోకి నెట్టొద్దు. ఆలోచించండి..!!


మళ్లీ కుండపోత వర్షం... జలమయమైన లోతట్టు ప్రాంతాలు...

నగరంలో మళ్లీ కుండపోత కురిసింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. గుడిమల్కాపూర్, రెడ్‌హిల్స్, నాంపల్లి, శ్రీనగర్‌కాలనీ, జూబ్లీహిల్స్, కార్వాన్, ఆసిఫ్‌నగర్‌తో పాటు చాలా ప్రాంతాల్లో 10–15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ గోదారులయ్యాయి. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు.